Monday, 19 June 2017

NDA President Candidate Ramnath Kovind || BJP has announced his President candidate || Indian President After july 2017

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ను భాజపా ఎంపిక చేసింది. అంతకు ముందు అనేక మంది పేర్లు తెరపైకి వచ్చినా కోవింద్‌ను భాజపా అగ్రనాయకత్వం ఎంపిక చేయడంతో సస్సెన్స్‌కు తెరపడినట్టయింది. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యదేశానికి రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించడం ఆషామాషీ వ్యవహారం కాదు. దీంతో అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని న్యాయకోవిదుడు, రాజ్యాంగ నిపుణుడు, అట్టడుగు వర్గాల ప్రతినిధిగా పేరుపొందిన రామ్‌నాథ్‌ను పదవికి అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.


అణగారిన వర్గాల గొంతుక..
సమాజంలోని దళిత, ఆదీవాసీ, మైనార్టీ, మహిళల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన ఘనత రామ్‌నాథ్‌ది. 1997లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొన్ని నిబంధనలు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉండటంతో దానిపై న్యాయపరమైన పోరాటం చేశారు. చివరకు వాజ్‌పేయి ప్రధానిగా ఎన్డీయే అధికారంలోకి వచ్చిన సమయంలో వాటిని రద్దు చేయించారు. పేదలకు సంబంధించిన పలుకేసులను ఆయన వాదించి విజయం సాధించారు.
ఎన్నికలపై దృష్టి...
2019లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది గుజరాత్‌ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా గుజరాత్‌లో భాజపా అధికారంలో ఉంది. ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం కావడంతో ఇక్కడ గెలుపు అత్యంత కీలకం. ఈ ఏడాది జరిగిన ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ ఎన్నికల్లో భాజపా విజయం సాధించి ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటుచేసింది. ప్రతిష్టాత్మకమైన యూపీలో భాజపా అధికారంలోకి వచ్చేందుకు దళితులు, మైనార్టీలు తోడ్పాడ్డారు. 2019 ఎన్నికల్లోనూ ఎన్డీయే తిరిగి అధికారంలో వచ్చిందుకు ఈ ఎంపిక దోహదం చేస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
సుదీర్ఘమైన రాజకీయ అనుభవం
రామ్‌నాథ్‌ కోవింద్‌కు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. భాజపా స్థాపించిన నాటి నుంచి పార్టీలో కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. 1994లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. రెండు పర్యాయాలు ఎంపీగా కొనసాగారు. కీలకమైన దళిత, ఆదీవాసీ సంక్షేమం, హోంశాఖ, పెట్రోలియం, సామాజిక న్యాయం, న్యాయం... తదితర పార్లమెంటరీ కమిటీలకు ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.
కీలకమైన పదవుల్లో...
కోవింద్‌ అనేక కీలకమైన పదవుల్లో కొనసాగారు. లఖ్‌నవులోని డా. బీఆర్‌ అంబేద్కర్‌ యూనివర్శిటీ యూనివర్శిటీ మేనేజ్‌మెంట్‌ బోర్డులో సభ్యునిగా బాధ్యతలు నిర్వహించారు. కోల్‌కతాలోని ఐఐఎంలోని బోర్డ్‌ ఆప్‌ గవర్నర్స్‌లో సభ్యునిగా ఉన్నారు. ఐరాస సర్వప్రతినిధి సమావేశంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడంతో పాటు ప్రసంగించారు. ఎంపీ హోదాలో థాయ్‌లాండ్‌, నేపాల్‌, పాకిస్థాన్‌, సింగపూర్‌, జర్మనీ, స్విట్జర్లాండ్‌, ఫ్రాన్స్‌, యూకే, యూఎస్‌ఏ... తదితర దేశాల్లో పర్యటించి అక్కడ రాజకీయపరిస్థితులపై అధ్యయనం చేశారు.
16 ఏళ్లు న్యాయవాదిగా..
కోవింద్‌ దిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో 16 ఏళ్లు న్యాయవాదిగా సేవలు అందించారు. న్యాయవాదిగా పలు కేసులను వాదించి గెలిచారు. ఆయనంటే బార్‌కౌన్సిల్‌లో విశేషమైన గౌరవం. పేదలకు సంబంధించిన కేసుల్లో ఎలాంటి ఫీజు తీసుకోకుండా ఉచితంగానే వాదించేవారు.
క్లీన్‌ ఇమేజ్‌...
ఆయనకున్న క్లీన్‌ ఇమేజ్‌ రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ఎంపిక చేసేందుకు దోహదపడిందని చెప్పవచ్చు. సుదీర్ఘకాలం రాజ్యసభ సభ్యునిగా ఉన్నా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. భారతదేశం గ్రామాల సమూహమని గ్రామాల్లో మౌలికసౌకర్యాలు కల్పించాలని ఆయన కోరేవారు. ప్రత్యేకించి గ్రామాల్లో విద్యాసౌకర్యాల ఏర్పాటు కోసం కృషి చేశారు.
భాజపా వ్యూహం..
భాజపా అగ్రవర్ణాల పక్షమని ప్రతిపక్షాలు ఆరోపణ చేసేవి. ఈ ఆరోపణలకు కోవింద్‌ ఎంపికతో శాశ్వతంగా చెక్‌పెట్టినట్టయింది. ఎన్డీయే అభ్యర్థిని వ్యతిరేకిస్తామని పశ్చిమబెంగా సీఎం మమతాబెనర్జీ, వామపక్షాలు, కాంగ్రెస్‌లు ఇంతకు ముందు ప్రకటించాయి. అయితే కోవింద్‌ అభ్యర్థిత్వంపై ఎలా వ్యవహరిస్తాయో చూడాలి. అన్ని పక్షాలు కలిసివస్తే ఏకాభిప్రాయం ఏర్పడి ఏకగ్రీవ ఎన్నిక జరిగే అవకాశముంది.
నాడు కలాం... నేడు రామ్‌నాథ్‌..
గతంలో ఎన్డీయే-1 అధికారంలో ఉన్న సమయంలో భారత క్షిపణి పితామహుడు అబ్దుల్‌ కలాంను రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఒక శాస్త్రవేత్తను రాష్ట్రపతిగా ఎంపిక చేసిన ఘనత ఎన్డీయేకు దక్కింది. తాజాగా రామ్‌నాథ్‌ను ఎంపిక చేయడం ద్వారా దళితుల సంక్షేమానికి తాము ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో స్పష్టంచేసింది.

No comments:

Post a Comment