Friday, 26 May 2017

నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌ సింగ్ ల ‘రారండోయ్.. వేడుక చూద్దాం’ మూవీ రివ్యూ-రేటింగ్ || Raa Randoy Veduka chuddam movie review and rating

సినిమా : రారండోయ్‌.. వేడుక చూద్దాం
న‌టీన‌టులు : నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌ సింగ్, జగపతిబాబు, సంపత్ తదితరులు
నిర్మాత : నాగార్జున అక్కినేని
కథ – మాటలు – దర్శకత్వం : కళ్యాణ్‌కృష్ణ కురసాల
మ్యూజిక్ : దేవిశ్రీప్రసాద్‌
సినిమాటోగ్రఫీ : ఎస్‌.వి.విశ్వేశ్వర్‌
ఎడిటర్ : గౌతంరాజు
బ్యానర్ ‌: అన్న‌పూర్ణ స్టూడియోస్
రిలీజ్ డేట్ : 26-05-2017


నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రారండోయ్.. వేడుక చూద్దాం’. ‘సోగ్గాడే చిన్ని నాయన’ ఫేం కళ్యాణ్ కృష్ణ దర్వకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ‘నిన్నే పెళ్ళాడతా’ తరహాలో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ ఈ చిత్ర నిర్మాత అక్కినేని నాగార్జున చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. ఆ సినిమాలాగే ఇది కూడా ఆడియెన్స్‌ని అలరిస్తుందని, చైతూ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని యూనిట్ ప్రచారం చేస్తూ వచ్చింది. మరి ఆ అంచనాల్ని అందుకోవడంలో ఈ చిత్రం సక్సెస్ అయ్యిందా? లేదా? రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం పదండి..
కథ : భ్రమరాంబ (రకుల్‌ప్రీత్‌సింగ్‌) ఒక పల్లెటూరు అమ్మాయి. చాలా గారాబంగా పెరిగిన ఈమె.. మనసులో ఏది ఫిక్స్ అవుతుందో దానికే కట్టుబడి వుంటుంది. తన కుటుంబసభ్యులతో హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తున్న భ్రమరాంబ అనుకోని సందర్భంలో పట్టణానికి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు తల్లి అక్కడున్న అబ్బాయిలతో జాగ్రత్తగా వుండమని మందిలిస్తే.. తాను ఎలాంటి తప్పు చేయనని, తండ్రి చూసిన సంబంధాన్నే చేసుకుంటానని అమ్మకి మాటిచ్చి, పట్టణానికి బయలుదేరుతుంది.


కట్ చేస్తే.. పట్టణంలో భ్రమరాంబకు శివ(నాగ చైతన్య) పరిచయమవుతాడు. అయితే.. అతనితో ఫ్రెండ్‌షిప్ చేయడానికి ఆమె ఒక కండిషన్ పెడుతుంది. ప్రేమ అంటూ వెంట పడొద్దని, ఎప్పుడైనా నీ మనసులో ప్రేమ అనే భావన కలుగుతుందో అప్పుడు వెంటనే దూరమవుతానని శివకి చెబుతుంది. అందుకు శివ ఒప్పుకుని ఆమెతో ఫ్రెండ్‌షిప్ చేస్తాడు కానీ.. మనసులో ఆమెపై ప్రేమ కలుగుతుంది. ఈ విషయం చెబితే భ్రమరాంబ ఎక్కడ దూరం అవుతుందోనని భయంతో బయటకు చెప్పడు.
ఇలా కొన్నాళ్లపాటు ఇద్దరూ స్నేహితులుగా బాగానే వుంటారు కానీ.. ఓరోజు భ్రమరాంబకి నిజం తెలుస్తుంది. ఫ్రెండ్‌షిప్‌ను అడ్డుపెట్టుకుని శివ తనను ప్రేమిస్తున్నాడని భ్రమరాంబకు అర్థమౌతుంది. అప్పుడామే శివకి గుడ్‌బై చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? శివ తన ప్రేమని దక్కించుకోవడం ఏం చేశాడు? అసలు వీరిద్దరి కుటుంబ నేపథ్యాలు ఏమిటి? అనే అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

నటీనటుల ప్రతిభ :
నాగచైతన్య ఎప్పట్లాగే మంచి నటన కనబరిచాడు. ఓ అల్లరి అబ్బాయి పాత్రలో ఆకట్టుకున్నాడు. భ్రమరాంబ క్యారెక్టర్‌లో రకుల్ బాగా ఒదిగిపోయింది. ఆ పాత్రకి పూర్తి న్యాయం చేసింది. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఇక జగపతిబాబు మరోసారి హుందాగా నటించాడు. సంపత్‌రాజు నటన ఆకట్టుకుంటుంది. కమెడియన్లందరూ నవ్వించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ అయితే కడుపుబ్బా నవ్వించేశాడు. ఇతర నటీనటులు ఓకే.
సాంకేతిక పనితీరు :
ఎస్‌.వి.విశ్వేశ్వర్‌ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి సన్నివేశాన్ని చాలా కలర్‌ఫుల్‌గా చూపించారు. దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు ఆల్రెడీ సక్సెస్ అయ్యాయి. విజువల్‌గానూ బాగానే కుదిరాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరింది. ముఖ్యంగా.. ఎమోషనల్ సీన్స్ టైంలో వచ్చే నేపథ్య సంగీతం బాగుంది. ఆర్ట్ వర్క్, ఎడిటింగ్ వర్స్క్ ఫర్వాలేదు. నాగార్జున నిర్మాణ విలువలకు ఎలాంటి ఢోకా లేదు. ఇక దర్శకుడు కళ్యాణ్ కృష్ణ విషయానికొస్తే.. ఫస్టాఫ్ మీద పెట్టిన దృష్టి రెండో భాగంలోనూ పెట్టి వుంటే బాగుండేది. ఎంతోమంది నటీనటులున్నా.. వారిని ఉపయోగించుకోలేదు. కేవలం నలుగురిని మాత్రమే హైలైట్ చేశాడు. ఓవరాల్‌గా మాత్రం దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్నాడు.
చివరగా : ఫ్యామిలీ ఆడియెన్స్‌ని అలరించే కుటుంబకథాచిత్రం.
రేటింగ్ : 3/5

1 comment: